chintamaneni: జగన్ మీడియాలో అవాస్తవాల ప్రచారం... పోలీసులకు ఎమ్మెల్యే చింతమనేని ఫిర్యాదు!
- సోషల్ మీడియాలో చింతమనేని వ్యాఖ్యలు వైరల్
- దళితులకు రాజకీయాలెందుకన్నారని ప్రచారం
- తన అనుచరులతో భారీ ర్యాలీ
- నిరసనకు దిగిన చింతమనేని
తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని దళితులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నిస్తూ, రాయలేని పదాలను వాడుతూ తిట్లకు దిగారని, రాజకీయాలు మీకెందుకురా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన చింతమనేని, తన అనుచరులు, కార్యకర్తలతో కలసి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఈ ఉదయం ధర్నాకు దిగారు. అంతకుముందు ఆయన తన కార్యకర్తలతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన, జగన్ తన మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై ఎస్పీ రవికుమార్ కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.