Jagtial District: ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ‘ఒకే ఒక్కడు’!
- ఒక్క ఓటు కోసం మల్యాల మండలంలో కేంద్రం ఏర్పాటు
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో భాగం
- మార్పునకు అధికారుల యత్నం
ఎన్నికల సమయంలో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అటువంటి విచిత్రమే చోటు చేసుకుంటోంది. ఒకే ఒక్క ఓటరు కోసం ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో 553 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. వీరికోసం జిల్లాలోని 16 మండలాల్లో మండలానికో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ఎన్నికల అధికారులు ఆదేశించారు.
అయితే మల్యాల మండంలో ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. ఇతడు ఒక్కడి కోసమే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను ఎత్తివేసి సమీప కేంద్రాల్లో విలీనం చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రాజేశం తెలిపారు.