Donald Trump: పుల్వామా దాడి అత్యంత భయంకరమైనది!: డొనాల్డ్ ట్రంప్
- ఉగ్రదాడి కలవరపరిచింది
- ఈ తరహా దాడులను ఖండించాల్సిందే
- ఇండియా, పాక్ లు కలసి ముందడుగు వేయాలి
- వైట్ హౌస్ లో మీడియాతో ట్రంప్
భారత్ లోని పుల్వామా ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆర్మీ కాన్వాయ్ పై జరిపిన ఆత్మాహుతి దాడి అత్యంత భయంకరమైన ఘటనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. వైట్ హౌస్ లోని ఓవెల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఫిబ్రవరి 14న జరిగిన ఈ దాడి తనను కలవర పరిచిందని అన్నారు. ఈ దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయని, దక్షిణాసియాలోని ఈ రెండు దేశాలూ కలసి ముందడుగు వేసి అద్భుతాన్ని చూపాలని కోరారు.
"ఈ సంఘటనపై ఎన్నో రిపోర్టులను పరిశీలించాను. సరైన సమయంలో మాట్లాడాలని అనుకున్నాను. వారు (ఇండియా, పాకిస్థాన్) కలసి నడిస్తే అద్భుతమే. అది జరగాలని కోరుకుంటున్నా. ఉగ్రదాడి దారుణమైన పరిస్థితే. ఇటువంటి వాటిని ఖండించాల్సిందే" అని అన్నారు. కాగా, దాడి తరువాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మాట్లాడుతూ, స్వీయ రక్షణ కోసం ఎటువంటి చర్యను తీసుకునేందుకైనా భారత్ కు హక్కుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.