Anantapur District: వారంతట వారే ఇళ్లు ఖాళీ చేస్తారు.. ఆ ఊళ్లో ఇప్పటికీ తరతరాల ఆచారం!
- నాలుగు వందల ఏళ్లుగా తలారిచెరువు గ్రామంలో ఆచారం ఇది
- కులమతాలకు అతీతంగా ఏడాదికో రోజు పండుగ
- మాఘపౌర్ణమి రోజంతా దర్గావద్దే ఆటపాటా, వంటావార్పు
నమ్మకం మనిషిని నడిపించే దైవం. ఇందుకు కులమతాలు అడ్డురావు. ఆ ఊరి ఆచారం దీనికి ఓ ఉదాహరణ. గ్రామంలో అధిక శాతం హిందువులే. కానీ ఏటా ఓ దర్గా వద్ద ఉండి పూజలు చేసి పండుగ జరుపుకొంటారు. ఈ పండుగకు కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, ఇతర బంధువర్గానికి ఆహ్వానం పంపుతారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సమీపంలోని తలారిచెరువు గ్రామస్థులు పాటించే ఈ ఆచారం వింతగా అనిపిస్తుంది.
ఏటా మాఘపౌర్ణమి రోజున గ్రామస్థులంతా సూర్యుడు ఉదయించక ముందే గ్రామాన్ని ఖాళీ చేసేస్తారు. మళ్లీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఇళ్లకు చేరుకుని ఇంటి ముందు ప్రవేశ ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. మధ్యకాలమంతా గ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజివలి దర్గావద్దే గడుపుతారు.
నిన్న మాఘపౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని చిన్నాపెద్ద అన్న తారతమ్యం లేకుండా గ్రామస్థులంతా తెల్లవారు జామున లేచి కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా దర్గావద్దకు చేరుకున్నారు. తమతోపాటు తమ పశువులను కూడా తీసుకువెళ్లారు. అక్కడే అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఎవరికి వారు వంట చేసుకుని కుటుంబాలతో కలసి భోజనాలు చేశారు. దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. ఆటపాటలతో రోజంతా ఆనందోత్సాహాలతో గడిపారు. సూర్యుడు అస్తమించిన తర్వాత గ్రామంలోకి చేరుకున్నారు.
అక్కడితో అయిపోలేదు. అర్ధరాత్రి వరకు నిబంధన ఉండడంతో ఇళ్లముందు లైటు కూడా వేయలేదు. ఈలోగా మధ్యాహ్నం వండుకోగా మిగిలిన పదార్థాలను కుటుంబ సభ్యులంతా తిన్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం కాగానే ఇళ్లముందు కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పొయ్యి వెలిగించిన తర్వాతే ఇంటిని, పశువుల పాకలను శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు.
‘అనాదిగా వస్తున్న ఈ ఆచారం పాటిస్తే గ్రామానికి మేలు జరుగుతుందన్నది మా నమ్మకం. గతంలో ఆచారాన్ని ఉల్లంఘించిన వారు కష్టాలపాలయ్యారు. కొందరు చనిపోయారని కూడా పెద్దలు చెప్పారు. అందుకే మాఘపౌర్ణమి రోజు ఈ ఆనవాయతీ కచ్చితంగా పాటిస్తాం’ అని గ్రామస్థులు తెలిపారు. ‘ఇది ఏడాదికోసారి మాకు వచ్చే పండుగ రోజు. అందుకే ఆనందోత్సాహాలతో ఈ రోజును గడుపుతాం. మా పెద్దలు పాటించారు. మేము పాటిస్తున్నాం. మా పిల్లలు పాటిస్తారు’ అంటారు ఆ గ్రామస్థులు.