Oman: 50 ఓవర్ల మ్యాచ్‌లో 24 పరుగులు.. ప్రపంచంలోనే అతి చెత్త రికార్డు!
- ఒమన్‌లో స్కాట్లాండ్ టూర్
- 17 ఓవర్లలోనే ఒమన్ ఆలౌట్
- 280 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న స్కాట్లాండ్
స్కాట్లాండ్-ఒమన్ మధ్య మంగళవారం జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్‌లో ఇరు జట్లు రికార్డులు సృష్టించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 17.1 ఓవర్లలో 24 పరుగులకే ఆలౌట్ అయింది. ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. ఖవార్ అలీ మాత్రం స్కాట్లాండ్ బౌలర్లను ఎదురొడ్డాడు. 33 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు. ఒమన్ జట్టులో అలీ చేసిన 15 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
అనంతరం 25 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి తక్కువ స్కోరు చేసిన జట్ల జాబితాలో ఒమన్ నాలుగో స్థానంలో నిలిచింది.
అక్టోబరు 17, 2007లో బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ అండర్-19 జట్టు 14.3 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఆలౌట్ అయింది. సారాసెన్స్ జట్టు 19 పరుగులతో రెండో స్థానంలో నిలవగా, మిడిలెసెక్స్ 23 పరుగులతో మూడో స్థానంలో ఉంది. తాజాగా ఒమన్ 24 పరుగులతో నాలుగో స్థానానికి ఎక్కింది.