High Court: సెల్ ఫోన్ డ్రైవింగుకి 4 రోజుల జైలుశిక్ష వేస్తే వారి కుటుంబం పరిస్థితి ఏంటి?: తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

  • సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టుబడిన భరద్వాజ్
  • జైలుశిక్ష విధించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు
  • తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు న్యాయమూర్తులు

సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ తన వాహనాన్ని నడిపారన్న నేరానికి 4 రోజుల జైలు శిక్షను విధించడాన్ని తెలంగాణ హైకోర్టు ఆక్షేపించింది. ఇది చాలా చిన్న నేరమని, జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం ఏంటని ప్రశ్నించింది. జైలుకు వెళితే, ఆ యువకుడి మానసిక స్థితి, అతని కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు ఆలోచించాలని సూచించింది.

ఎంవీ భరద్వాజ అనే యువకుడు ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 4 రోజుల జైలుశిక్షను విధించారు. తన మేనల్లుడికి 4 రోజుల జైలుశిక్ష విధించడంపై భరద్వాజ మేనమామ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్‌ ఆర్ఎస్ చౌహాన్‌, జస్టిస్‌ టీ అమర్‌ నాథ్‌ గౌడ్‌ ల ధర్మాసనం విచారించింది. 4 రోజుల జైలుశిక్షను రద్దు చేస్తున్నామని, రూ. 500 జరిమానా కట్టాలని ఆదేశించింది.

భరద్వాజ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, ఈ తరహా కేసులో కింది కోర్టు జైలుకెళ్లి వచ్చిన వారిని సమాజం ఎలా చూస్తుందో పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. న్యాయాధికారులు దోషులుగా ఒక్క రోజు జైలులో ఉండి వస్తే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారం ఉందని ఈ తరహా తీర్పులిస్తే, దాన్ని దుర్వినియోగం చేసినట్టవుతుందని, ఓ నిర్ణయానికి వచ్చే ముందు అన్ని అంశాలను పరిశీలించాలని ఎప్పటికప్పుడు తాము చెబుతున్నా పట్టించుకోవడం లేదని హైకోర్టు పేర్కొంది. 

  • Loading...

More Telugu News