Jagan: చంద్రబాబును కలిసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. జగన్ సీఎం కాకుండా చూడాలన్న మర్రి శశిధర్ రెడ్డి

  • అమరావతిలో చంద్రబాబును కలిసిన మర్రి
  • జగన్ హామీలు చూసి జనాలు నవ్వుకుంటున్నారన్న సీఎం
  • మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని జోస్యం

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని, ఆ నమ్మకం తమకు ఉందని అన్నారు.

మంగళవారం అమరావతి వచ్చిన శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ ఒక్కటైనప్పటికీ అధికారంలోకి రాకపోవడంపైనా చర్చించినట్టు సమాచారం. పొత్తు ఎందుకనే విషయాన్ని ప్రజలకు సరిగ్గా వివరించడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమైందని, ఓటమి అందుకేనని శశిధర్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన జరిగినప్పుడే జగన్ ఏపీకి సీఎం కాకుండా అడ్డుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మర్రి.. ఆయన సీఎం అయితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయని చెప్పారు. తాము అమలు చేస్తున్న పథకాలనే జగన్ తాను అధికారంలోకి వచ్చాక చేస్తానని చెబుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  

Jagan
YSRCP
Chandrababu
Marri Sasidhar reddy
Telangana
Congress
  • Loading...

More Telugu News