Pakistan: పాకిస్థాన్ ప్రధాని అలా స్పందించడంలో ఆశ్చర్యమేమీ లేదు: కేంద్రం
- దాడులను పాక్ ఎప్పుడూ ఖండించదు
- దాయాది బుద్ధే అంత
- తీవ్రస్థాయిలో స్పందించిన భారత్
పుల్వామా దాడిలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడంపై భారత్ వెంటనే స్పందించింది. పాకిస్థాన్ ప్రధానిగా ఎవరున్నా భారత్ లో దాడి జరిగినప్పుడు ఇలాగే వ్యాఖ్యానిస్తుంటారని, ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రకటనలు తమకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పుల్వామా దాడిపై మా పాత్ర ఉందని భావిస్తే ఆధారాలు చూపించాలి, భారత్ యుద్ధాన్నే కోరుకుంటే అందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి భారత్ కూడా అదే మోతాదులో బదులిచ్చింది.
పుల్వామాలో భారత జవాన్లపై దాడిని పాక్ ప్రధాని ఖండించకపోవడం, ఇది టెర్రరిస్టుల దుశ్చర్య అని పేర్కొనకపోవడం తమకేమీ ఆశ్చర్యకరంగా అనిపించలేదని భారత వర్గాలు వ్యంగ్యం ప్రదర్శించాయి. పాక్ ప్రధాని పుల్వామా ఆత్మాహుతి దాడిని ఖండించడం కానీ, అమరజవాన్ల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం కానీ చేయలేదని విమర్శించాయి. తీవ్రవాదానికి పాకిస్థాన్ ఆయువుపట్టు అని ఆరోపిస్తూ ఉగ్రవాదులపై ప్రత్యక్ష చర్యలకు దిగాల్సిందేని భారత విదేశీ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యం అమలులో భారత్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా ఉందని, ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎన్నటికీ అర్థం చేసుకోలేదని దుయ్యబట్టింది.