Pakistan: అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు భంగపాటు
- జాదవ్ కేసు వాయిదా వేయాలంటూ విజ్ఞాపన
- తిరస్కరించిన అంతర్జాతీయ న్యాయస్థానం
- విచారణ కొనసాగుతుందంటూ స్పష్టీకరణ
కుల్ భూషణ్ జాదవ్ కేసులో విచారణ జరుపుతున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజు విచారణ సందర్భంగా తమ అడ్ హాక్ న్యాయమూర్తి గుండెపోటుకు గురైన నేపథ్యంలో కేసు విచారణ వాయిదా వేయాలంటూ పాక్ కోరింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రం పాక్ విజ్ఞప్తికి ససేమిరా అంది. మరొక అడ్ హాక్ న్యాయమూర్తిని నియమించుకునేందుకు సమయం అవసరం అని, ఈ కారణంగానే వాయిదా కోరుతున్నామని పాక్ వర్గాలు చేసిన అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందిస్తోంది. చాలాకాలంగా నలుగుతున్న కుల్ భూషణ్ జాదవ్ కేసు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో విచారణకు రావడంతో ఇరు దేశాలు పట్టుదల కనబరుస్తున్నాయి. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణ ప్రారంభం నుంచి భారత్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
విచారణ మొదటిరోజునే పాకిస్థాన్ అడ్ హాక్ జడ్జి తసాదక్ హుస్సేన్ జిలానీ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అడ్ హాక్ జడ్జి లేకుండానే పాక్ తన వాదనలు వినిపించాల్సి వచ్చింది. ఈ కారణంగానే నూతన అడ్ హాక్ జడ్జిని నియమించుకునే అవకాశం ఇవ్వాలని పాక్ కోరగా, అవసరంలేదు... మీ వాదనలు కొనసాగించండి అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం నిష్కర్షగా చెప్పేసింది. భారత నేవీ అధికారి అయిన కుల్ భూషణ్ జాదవ్ ను పాకిస్థాన్ గూఢచర్యం కేసులో నిర్బంధించిన సంగతి తెలిసిందే. భారత్ ఒత్తిడి కారణంగా ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం ముంగిట చేరింది.