Narendra Modi: రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి: మోదీ
- నైతిక స్థైర్యం కోల్పోవద్దు
- సెమీ హైస్పీడు లక్ష్యంగా విమర్శలు
- ఇంజినీర్ల శ్రమను దేశం గౌరవిస్తోంది
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మరుసటి రోజే ఆ రైలు సాంకేతిక సమస్యలకు లోనయింది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా విమర్శనాత్మక ట్వీట్ చేశారు. దీనిపై నేడు ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకు పడ్డారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారని మోదీ విమర్శించారు.
ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోవద్దని ప్రజలకు సూచించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు లక్ష్యంగా విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులో భారత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు భాగమని, ఈ రైలును విమర్శించడమంటే.. వారిని అవమానించడమేనని అన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని.. వారు దేశానికి గర్వకారణమని అన్నారు.