KCR: సీఎం అయిన 66 రోజుల తరువాత తన టీమ్ ను తెరపైకి తెచ్చిన కేసీఆర్!
- ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం
- పది మందితో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
- హాజరైన పలువురు ప్రముఖులు
తాను తెలంగాణకు రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 66 రోజుల తరువాత, తన టీమ్ ను ఎంచుకున్నారు కేసీఆర్. ఈ ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రులుగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలు ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన ప్రతిఒక్కరూ గవర్నర్ కు అభివాదం చేసి, ఆపై కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కొందరు కాళ్లకు నమస్కరించబోగా, కేసీఆర్ వారిని వారించారు. దాదాపు 1200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం తరువాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి.