Donald Trump: క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్... దావా వేసిన 16 రాష్ట్రాలు!
- ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన రాష్ట్రాలు
- ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి నిధులు తీసుకోవడం కుదరదు
- కాంగ్రెస్ అనుమతి తప్పనిసరంటూ దావా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. మెక్సికో బార్డర్ లో గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్ వైఖరిని నిరసిస్తూ, 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ఈ రాష్ట్రాలన్నీ ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దావా వేశాయి. ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధమని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి నిధులు మంజూరు చేసుకోవడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని, నిధుల మంజూరుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరని ఈ రాష్ట్రాలు అంటున్నాయి.
సైనికుల కోసం, ప్రకృతి విపత్తులు సంభవించిన వేళ, ప్రజలను ఆదుకునేందుకు, ఇతర అవసరాలకు కేటాయించిన నిధులను ట్రంప్ తీసుకున్నారని, దీనివల్ల భవిష్యత్తులో ముప్పు తప్పదని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బీసెర్రా హెచ్చరించారు. ట్రంప్ పై దావా వేసిన రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి.