Pakistan: ఒక్క చెంపదెబ్బతో జైషే చీఫ్ మసూద్ అజహర్ అన్నీ కక్కేశాడట!
- చాలా పిరికివాడు
- ఇంటరాగేషన్ లో వణికిపోయాడు
- జైషే చీఫ్ గురించి చెప్పిన ఆర్మీ అధికారి
మౌలానా మసూద్ అజహర్... కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. భారత్ అంటే వల్లమాలిన ద్వేషం ప్రదర్శించే మసూద్ అజహర్ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారకుడు. కశ్మీర్ కోసం భారత్ ను అస్థిరతకు గురిచేయడమే అతడి ఏకైక అజెండా. అందుకోసం ఎంత దారుణానికైనా తెగిస్తాడు. అయితే ఇవన్నీ పైకి కనిపించే విషయాలేనని, వాస్తవానికి మసూద్ అజహర్ చాలా పిరికివాడని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడ్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఇంటరాగేషన్ మొదలైన కొన్ని నిమిషాలకే అతడ్ని ఓ ఆర్మీ అధికారి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన మసూద్ అజహర్ అడిగినవీ, అడగనివీ అన్నీ చెప్పేశాడట. పాకిస్థాన్ భూభాగంపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రసంస్థలు ఎలా పనిచేస్తాయో అన్నీ కూలంకషంగా వివరించాడని సదరు ఆర్మీ అధికారి మీడియాకు వివరించాడు. అజహర్ తో నిజాలు కక్కించేందుకు ఎంతో కష్టపడాలేమో అని భావించామని, కానీ అతడెంతో సులభంగా చెప్పేశాడని ఆ అధికారి వెల్లడించారు.
ఇదే విషయం గురించి సిక్కిం రాష్ట్ర డీఐజీ అవినాశ్ మోహననే కూడా వ్యాఖ్యానించారు. ఆయన కూడా గతంలో పలుమార్లు మసూద్ అజహర్ ను ఇంటరాగేట్ చేశారు. "మసూద్ అజహర్ పైకి కనిపించేంత గట్టివాడు కాదు... అతడ్ని బెదిరించడం చాలా సులభం. ఒక్క చెంపదెబ్బకే బెంబేలెత్తిపోయాడు. ఆ అధికారి కొట్టిన దెబ్బకు నిలువెల్లా కంపించిపోయాడు. దాంతో అతడిపై మేం ప్రయోగించాలి అని భావించిన పద్ధతులన్నీ పక్కనబెట్టేశాం. ఇంటరాగేషన్ జరిగినంత సేపు మేం అడగాల్సినవన్నీ అతడే చెప్పేశాడు" అని వివరించారు.