Uttar Pradesh: డబ్బులు పోయాయట.. అసెంబ్లీలో భోరున విలపించిన యూపీ ఎమ్మెల్యే
- పోలీసులు పట్టించుకోలేదంటూ ఆవేదన
- రికవరీ చేయకపోతే చస్తానంటూ బెదిరింపు
- యూపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే కల్పనాథ్ పాశ్వాన్ తన డబ్బులు చోరీకి గురయ్యాయని, ఆ సొమ్మును రికవరీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుని చస్తానంటూ బెదిరించారు. కల్పనాథ్ మాటలతో అసెంబ్లీలో తీవ్ర కలకలం రేగింది.
అజాంగఢ్ లోని ఓ హోటల్ లో తనకు చెందిన రూ.10 లక్షలు పోయాయని, ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెబుతూ కల్పనాథ్ భోరున విలపించారు. సభలో చేతులు కట్టుకుని మరీ వేడుకుంటున్నానని, తాను చాలా పేదవాడినని, తన సొమ్మును తీసుకొచ్చి అప్పగించకపోతే చావే శరణ్యం అంటూ సభలో ఉన్నవాళ్ల చేత కూడా కన్నీళ్లు పెట్టించినంత పనిచేశాడు కల్పనాథ్ పాశ్వాన్.
కల్పనాథ్ అజాంగఢ్ లోని మెహ్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కల్పనాథ్ వ్యవహారాన్ని పట్టణాభివృద్ధి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. కల్పనాథ్ డబ్బులు పోయిన వ్యవహారంలో పూర్తి నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ హోంశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.