vishwanath: తెరపైకి కె.విశ్వనాథ్ జీవితచరిత్ర
- కళాతపస్వి అనిపించుకున్న విశ్వనాథ్
- టైటిల్ గా 'విశ్వదర్శనం'
- దర్శకుడిగా జనార్దన మహర్షి
తెలుగు తెరకి కళాత్మక చిత్రాలను పరిచయం చేసిన దర్శకుడు కె. విశ్వనాథ్. కథకు కళను జోడించి కమనీయంగా నడిపించిన కళాతపస్వి ఆయన. ఆయన సినిమాలను మనసుతో చూడాలి .. మనసుతోనే వినాలి. అప్పుడే అవి అర్థమవుతాయి .. అందమైన అనుభూతిని ఆవిష్కరిస్తాయి. అలాంటి ఆయన పుట్టిన రోజు రేపు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'విశ్వదర్శనం' పేరుతో విశ్వనాథ్ జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు జనార్దన మహర్షి రంగంలోకి దిగాడు.
'విశ్వదర్శనం' అనే టైటిల్ కి 'వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ'అనేది ట్యాగ్ లైన్ గా పెట్టారు. విశ్వనాథ్ చేతుల మీదుగా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ ... " నేనెవరన్నది ప్రపంచానికి చాటి చెప్పాలనే దురుద్దేశం నాకు లేదు. నాపై గల అభిమానంతో జనార్దన మహర్షి చేస్తోన్న ప్రయత్నం ఇది. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.
ఇక తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. "విశ్వదర్శనం అంటే విశ్వనాథ్ గారు దర్శించిన సమస్త విషయాలను మనం దర్శించడం. విశ్వనాథ్ గారికి జనార్దన మహర్షి అభిమాని కాదు .. భక్తుడు. ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారకులు విశ్వనాథ్ గారే. గురువు పట్ల కృతజ్ఞతా భావంతో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు" అని అన్నారు. ఇక దర్శకుడు జనార్దన మహర్షి మాట్లాడుతూ .. " విశ్వనాథ్ గారి వ్యక్తిత్వం .. సమాజంపై ఆయన సినిమాలు చూపిన ప్రభావం గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది" అన్నారు.