India: పాక్ పై యుద్ధానికి రండి... వెంట మేముంటాం: బెలూచ్ నేషనల్ కాంగ్రెస్
- వెంటనే అన్ని ద్వైపాక్షిక బంధాలను తెంచుకోవాలి
- పుల్వామా ఉగ్రదాడి కారకులను శిక్షించాలి
- బెలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహీద్
ఇండియా వెంటనే పాక్ తో అన్ని రకాల ద్వైపాక్షిక బంధాలను తెంచుకోవాలని, వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలని బెలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ (బీఎన్సీ) అధ్యక్షుడు వహీద్ బెలోచ్ కోరారు. యుద్ధం జరిగితే ఇండియాకు తాము సహకరిస్తామని అన్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న పాక్ కు, సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని బీఎన్సీ ఎంతో కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి కారకులైన వారిని చట్టం ముందు నిలిపి శిక్షించాలని సూచించిన వహీద్, ఇండియాలో తమ నేత ఖాన్ కలాత్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కూడా ఆయన కోరారు. తమ ప్రాంతం ఆక్రమణకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడేందుకు భారత్ సహకారం కోరుతున్నామని ఆయన అన్నారు.