Sania Mirza: దేశభక్తి ఉందంటూ గొంతు చించుకుని అరవమంటారా?: సానియా మీర్జా అసహనం
- విమర్శలకు సమాధానంగా మరో ట్వీట్
- దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు
- సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తోడుగా ఉంటా
భారత టెన్నిస్ రంగంలో తిరుగులేని ధృవతార సానియా మీర్జా. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవడంతో ఆమెను అందరూ పొరుగుదేశం కోడలిగానే చూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి స్పర్ధ వచ్చినా సానియా ఏదో ఒక విధంగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఇటీవల ఆ ధోరణి బాగా పెరిగిపోయింది.
తాజాగా, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనూ సానియా మీర్జాపై మునుపటి కంటే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి జరిగిన అనంతరం సానియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేసి చిక్కుల్లో పడింది. దాంతో ఆమె దేశభక్తిని శంకిస్తూ అనేక పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. వాటికి జవాబుగా ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది సానియా మీర్జా. ఈ మేరకు ట్విట్టర్ లో తన స్పందన తెలియజేసింది.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే దేశభక్తి ఉందని భావించేవాళ్ల కోసమే తాను ఈ పోస్ట్ పెడుతున్నానని వెల్లడించింది. తాము సెలబ్రిటీలం కాబట్టి తమపై బురద చల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయినా ఎవరో విమర్శించారని తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదని సానియా స్పష్టం చేసింది. తాము కూడా దేశభక్తులమేనని, ఉగ్రవాదానికి వ్యతిరేకం అని గొంతు చించుకుని అరవాల్సిన పనిలేదని వివరించింది.
"నా దేశం కోసం చెమటోడ్చి ఆడతాను. దేశం పేరు నిలబెట్టేందుకు మైదానంలో ఎంత కష్టమైనా పడతాను... ఆ విధంగా నా దేశానికి సేవ చేస్తాను. సీఆర్పీఎఫ్ జవాన్ల విషయానికొస్తే వాళ్లు రియల్ హీరోలు. వాళ్ల కుటుంబాలకు జీవితాంతం తోడుగా ఉంటాను. పుల్వామా దాడి జరిగిన ఫిబ్రవరి 14 దేశచరిత్రలో దుర్దినం. ఇప్పటికీ నేను ద్వేషం కంటే శాంతినే కోరుకుంటాను. ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే... ఏదైనా మంచి పని కోసం ట్రోల్ చేయండి, సెలబ్రిటీలు ఏమని పోస్ట్ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు పెడుతున్నారు అని కాదు మీరు చూడాల్సింది. దేశానికి మీ వంతు ఏదైనా చేయండి తప్ప ఇలాంటి ట్రోలింగ్ లు మాత్రం చేయకండి" అంటూ తన పోస్టులో పేర్కొంది సానియా మీర్జా.