Andhra Pradesh: బీసీలకు న్యాయం జరగాలంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ని గెలిపించండి: ఆర్.కృష్ణయ్య

  • నేను బీసీల కోసం పాటుపడే తీవ్రవాదిని 
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి
  • చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై జగన్ హామీ ఇచ్చారు

తాను బీసీల కోసం పాటుపడే తీవ్రవాదినని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న వైసీపీ ‘బీసీ గర్జన’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి అని, బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఈ రోజు బీసీల పిల్లలు మంచి చదువులు చదువుతున్నారంటే, అందుకు కారణం రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. బీసీల కోసం నాడు తాను చేసిన పోరాటాలపై రాజశేఖర్ రెడ్డి స్పందించారని గుర్తుచేశారు. తన తండ్రి అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తనకు ఆయన హామీ ఇచ్చారని, పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించి, సీఎం అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని అన్నారు. ప్రధానిని చాలాసార్లు కలిశానని చెబుతున్న చంద్రబాబు, ఒక్కసారైనా బీసీల రిజర్వేషన్ల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. డబ్బులకు, ప్రలోభాలకు, మాటలకు మోసపోవద్దని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  

Andhra Pradesh
eluru
YSRCP
BC GARJANA
  • Loading...

More Telugu News