Rajnath Singh: టాప్ స్పై ఆఫీసర్లతో రాజ్ నాథ్ సింగ్ రహస్య సమావేశం!
- రా, ఐబీ అధికారులను పిలిపించుకున్న రాజ్ నాథ్
- దాడి వెనుక పాక్ పాత్రపై చర్చలు
- పాక్ కు నోటీసులు పంపించాలని నిర్ణయం
దేశంలోని 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) సహా ఇంటెలిజెన్స్ విభాగాల టాప్ అధికారులతో హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు రహస్య సమావేశాన్ని నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడితో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో, ఆ దేశానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలన్న విషయమై ఈ సమావేశం జరిగినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఈ దాడి వెనుక పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రసంస్థలు ఉన్నాయంటూ నోటీసులు పంపించనున్నట్టు ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్స్ ఫోర్స్ అధికారి వెల్లడించారు. ఈ నోటీసుల్లో ఉగ్రవాదులతో పాక్ కు ఉన్న లింకులను ప్రస్తావించడం ద్వారా దాయాదిపై ఒత్తిడిని పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ప్రకటించుకున్న విషయాన్నీ ప్రస్తావించనున్నట్టు వెల్లడించారు.
కాగా, ఈ సమావేశానికి 'రా' చీఫ్ అనిల్ దశ్మానా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోమ్ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న స్పై ఏజన్సీలు, 22 ఏళ్ల జేఈఎం ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్, ఎలా దాడికి ప్లాన్ చేసిన విషయాన్ని రాజ్ నాథ్ కు వివరించారు.