Andhra Pradesh: చంద్రబాబుతో విభేదాలేం లేవు.. పొలిట్ బ్యూరో సమావేశం రోజు అందుకే గైర్హాజరు అయ్యాను!: అశోక్ గజపతిరాజు

  • 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా
  • ఢిల్లీ ధర్మపోరాట దీక్ష సందర్భంగా రాష్ట్రపతిని కలిశాం
  • విజయనగరంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అలక వహించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై అశోక్ గజపతిరాజు స్పందించారు. తాను ఏపీ ముఖ్యమంత్రిపై అలిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. తాను టీడీపీ కార్యకర్తననీ, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు.

చంద్రబాబుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, ఇటీవల ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష తర్వాత టీడీపీ అధినేతతో పాటు రాష్ట్రపతిని కలిశానని ఆయన గుర్తుచేసుకున్నారు. శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లడానికి ఢిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్‌బ్యూరో సమావేశం సమాచారం అందిందనీ, అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక గైర్హాజరు కావాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశానని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ పార్టీలోకి రావడం తనకిష్టం లేదన్నది వట్టి పుకారేనన్నారు. కిశోర్ చంద్రదేవ్ మంచి వ్యక్తి అనీ, ఆయన పార్టీలోకి రావడం స్వాగతించదగ్గ విషయమేనని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Vijayanagaram District
ashok gajapatiraju
angry
clarity
  • Loading...

More Telugu News