India: యుద్ధమే జరిగితే... ఇండియా, పాకిస్థాన్ బలాబలాలపై ఆసక్తికర అంశాలు!
- ఇరు దేశాల మధ్యా కమ్ముకున్న యుద్ధ మేఘాలు
- సైన్యం, ట్యాంకర్లు సరిహద్దులకు మోహరింపు
- పాక్ కన్నా మెరుగైన స్థితిలో ఇండియన్ ఆర్మీ
పుల్వామాలో సైనికులపై ఆత్మాహుతి దాడి తరువాత భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలూ తమ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సై అంటోంది. సైనిక బలగాల విషయంలో, ఆయుధ సంపత్తి విషయంలో పాక్ కన్నా ఇండియా రెండు మెట్లు పైనే ఉంది.
మరోపక్క, భారత ఆగ్రహాన్ని నిశితంగా గమనిస్తున్న పాక్, ఈ దాడిలో తమ ప్రమేయం లేదంటూనే, తమ జోలికి వస్తే ఎదుర్కునేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపుతోంది. ఇండియా మెరుపు దాడులకు దిగితే చూస్తూ ఊరుకోబోయేది లేదని స్పష్టం చేస్తోంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సైనిక పరంగా రెండు దేశాల బలాబలాలను ఓ మారు పరిశీలిస్తే...
ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద మిలటరీగా ఉండగా, పాకిస్థాన్ ఆరవ స్థానంలో ఉంది. ఇండియాలో త్రివిద దళాల్లోని జవాన్ల సంఖ్య 21.40 లక్షలు కాగా, పాక్ సైన్యం 6.54 లక్షలు. రిజర్వ్ దళాలు ఇండియాలో 11.55 లక్షలు కాగా, పాక్ వద్ద 5.13 లక్షలు ఉన్నాయి. ప్రధాన యుద్ధ ట్యాంకులు ఇండియా వద్ద 4,500 ఉండగా, పాక్ వద్ద 3 వేల వరకూ ఉన్నాయి. ఆర్మ్ డ్ ఫైటింగ్ వెహికిల్స్ భారత అమ్ములపొదిలో 6,704 ఉండగా, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ విషయంలో పాక్ మెరుగ్గా ఉంది. ఈ తరహా గన్స్ ఇండియా వద్ద 290 ఉండగా, పాక్ వద్ద ఏకంగా 465 ఉన్నాయి.
ఇక మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ఇండియా వద్ద 292 ఉండగా, పాకిస్థాన్ వద్ద 134 ఉన్నాయి. సాధారణ యుద్ధ విమానాలు ఇండియా వద్ద 2,216 ఉండగా, పాక్ వద్ద 1,143 ఉన్నాయి. జెట్ యుద్ధ విమానాలు ఇండియా వద్ద 323, పాక్ వద్ద 186 ఉన్నాయి. మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు భారత్ వద్ద 329, పాక్ వద్ద 225 ఉన్నాయి. హెలికాప్టర్లు ఇండియా వద్ద 775, పాక్ వద్ద 323 ఉన్నాయి. యుద్ధ విమానాలను మోసుకెళ్లగల వాహక నౌక ఇండియా వద్ద ఒకటి ఉండగా, పాక్ వద్ద అది కూడా లేదు. జలాంతర్గాములు ఇండియా వద్ద 15, పాక్ వద్ద 8 ఉన్నాయి. న్యూక్లియర్ వార్ హెడ్లు ఇండియా వద్ద 120 ఉండగా, పాక్ వద్ద 130 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక హిమాలయాలు సహా, సరిహద్దు పర్వత ప్రాంతాల్లో మనతో యుద్ధం చేయాలంటే, పాకిస్థాన్ సరైన పోటీ చూపే అవకాశాలు లేవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. భౌగోళికాంశాలన్నీ ఇండియాకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక, నివాస ప్రాంతాలను, సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని అణుబాంబులు విసిరేంత వరకూ యుద్ధం వెళితే, పాక్ తో పోలిస్తే నష్టం భారత్ కే అధికంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.