Guru: బోరున విలపిస్తూ భర్తకు సెల్యూట్... 'వీర జవాను' భార్య కళావతికి నెటిజన్ల హ్యాట్సాఫ్!

  • ఉగ్రదాడిలో అమరుడైన మాండ్యా ప్రాంత జవాను గురు
  • భర్తకు కడసారి వీడ్కోలు పలుకుతూ భార్య సెల్యూట్
  • కుటుంబానికి అండగా ఉంటామన్న కన్నడ సర్కారు

భరతమాత సేవలో అమర వీరుడైన ఓ జవాను భౌతికకాయం వద్ద ఆయన భార్య చేసిన వందనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్. కర్ణాటక, మాండ్యా సమీపంలోని గుడిగెరి ప్రాంతానికి చెందిన గురు, మొన్నటి ఉగ్రదాడిలో అసువులు బాయగా, శనివారం నాడు ఆయన అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగాయి.

తన భర్తకు కడసారి వీడ్కోలును పలికే వేళ, ఆయన భార్య కళావతి, గుండెలనిండా దేశభక్తిని నింపుకుని, పార్థివ దేహం ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఓ వీరపత్నిగా ఆమె అర్పించిన కన్నీటి వీడ్కోలు వీడియోలు, చిత్రాలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అంతకుముందు మూడు రోజుల నుంచి ముక్క మెతుకు ముట్టకుండా విలపిస్తూ కూర్చున్న ఆమె, ఆయనకు భార్యగా ఉండటం తన జన్మజన్మల అదృష్టమని చెబుతూ, మృతదేహం ముందు సెల్యూట్ చేశారు. కాగా, గురు కుటుంబాన్ని ఆదుకుంటామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని కన్నడ సర్కారు ప్రకటించింది. 

Guru
Kalavati
Karnataka
Jawan
  • Loading...

More Telugu News