Saina Nehwal: సైనా నెహ్వాల్ కు మరోసారి తలొగ్గిన సింధు
- జాతీయ బ్యాడ్మింటన్ షిప్ ఫైనల్స్
- సింధుకు తప్పని ఓటమి
- టైటిల్ నిలబెట్టుకున్న సైనా
సైనా నెహ్వాల్, పీవీ సింధు.. ఇద్దరూ హైదరాబాదీ అమ్మాయిలే! భారత బ్యాడ్మింటన్ రంగంలో తిరుగులేని స్టార్లు. అయితే సైనా తన సీనియారిటీని నిరూపించుకుంటూ యువ సంచలనం సింధుపై గతంలో పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. వాటికి కొనసాగింపుగా తాజాగా జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లోనూ జయకేతనం ఎగురవేసింది. శనివారం గువాహటిలో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్స్ లో సైనా 21-18, 21-15 తో సింధును మట్టికరిపించింది. గతేడాది కూడా జాతీయ టోర్నీ విజేతగా నిలిచిన సైనా ఈసారి మరింత జోరు ప్రదర్శించి టైటిల్ నిలబెట్టుకుంది.
నిర్ణాయక మ్యాచ్ లో సైనా తిరుగులేని ఆటతీరు ప్రదర్శించిందనడానికి నిదర్శనంగా ఈ పోరు కేవలం 30 నిమిషాల్లోనే ముగిసింది. సైనా తెలివైన ఆట ముందు సింధు పవర్ గేమ్ పనిచేయలేదు. సింధు లయ దొరకబుచ్చుకునే లోపే సైనా పని ముగించింది. ఓవరాల్ గా సైనా నెహ్వాల్ కు జాతీయ స్థాయిలో ఇది నాలుగో టైటిల్. ఆమె ఇంతకుముందు 2006, 2007, 2018లో విజేతగా నిలిచింది. ఇక, పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడోసారి జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పురుషుల టైటిల్ ను ఎగరేసుకెళ్లాడు. శనివారం జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21-18, 21-13తో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ ను చిత్తుచేశాడు.