Maharashtra: ‘పబ్ జీ’ గేమ్ ఎఫెక్ట్.. ఆడొద్దని చెప్పినందుకు సొంత బావను కత్తితో పొడిచిన యువకుడు!
- మహారాష్ట్రలోని కల్యాణ్ లో ఘటన
- ల్యాప్ టాప్ వైర్ ను కోసేసిన యువకుడు
- కేసు నమోదుచేసిన పోలీసులు
పబ్ జీ.. భారత్ లోని స్మార్ట్ ఫోన్ యూజర్లను ఊపేస్తున్న గేమ్ ఇది. కోట్లాది మంది యువతీయువకులు ఈ గేమ్ ను రోజూ ఆడుతున్నారు. అయితే దీన్ని ఆడుతున్న కొద్దీ యువతలో హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోతోంది. తాజాగా పబ్ జీ గేమ్ ఎక్కువగా ఆడొద్దని చెప్పినందుకు ఓ యువకుడు రెచ్చిపోయాడు. సొంత బావను కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ పట్టణంలో చోటుచేసుకుంది.
ముంబైకి సమీపంలోని కల్యాణ్ పట్టణంలో రజనీష్ రాజ్ భర్(27) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రజనీష్ సోదరికి ఇటీవల అంబర్ నాథ్(32) అనే వ్యక్తికి ఇచ్చి నిశ్చితార్థం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన అత్తారింటికి వచ్చిన అంబర్ నాథ్ ల్యాప్ టాప్ కు చార్జింగ్ పెట్టి పనిచేసుకుంటున్నాడు. అంతలోనే ఇంట్లోకి వచ్చిన రజనీష్ తన స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ అయిపోవడాన్ని గమనించాడు. తన చార్జర్ చెడిపోవడాన్ని గమనించిన రజనీష్ ఆగ్రహంతో ఊగిపోతూ ల్యాప్ టాప్ కు పెట్టిన చార్జింగ్ వైర్ ను కత్తితో కోసి పారేశాడు.
ల్యాప్ టాప్ చార్జింగ్ వైర్ ను కోయాల్సిన అవసరం ఏమొచ్చిందని బావ అంబర్ నాథ్ రజనీష్ ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కెరీర్ పై దృష్టి పెట్టాలనీ, పబ్ జీ గేమ్ ను ఎక్కువగా ఆడొద్దని అంబర్ నాథ్ సూచించారు. దీంతో సహనం కోల్పోయిన రజనీష్ అదే కత్తితో బావను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంబర్ నాథ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.