Andhra Pradesh: గిద్దలూరులో రైతు నిరసన: టమోటా పంటకు గిట్టుబాటు ధర రాక రోడ్డుపై పారబోసిన రైతన్న!
- ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఘటన
- రెండున్నర ఎకరాల్లో సాగుచేసిన ఆదిపుల్లయ్య
- బాక్సును రూ.40కే కొంటామనడంతో మనస్తాపం
పంట వేసిన దగ్గరి నుంచి చేతికి వచ్చేవరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. అయినా పంట చేతికి రాగానే మద్దతు ధర లేకపోవడం, దళారుల జోక్యంతో తక్కువ ధరకే పంటలను తెగనమ్ముకోవాల్సి వస్తుంది. కొన్నికొన్నిసార్లు అసలు వేసిన పంటకు గిట్టుబాటు ధర కూడా దొరకదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాము సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఓ రైతు తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు.
జిల్లాలోని గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన రైతు ఆదిపుల్లయ్య ఈసారి రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంటను సాగు చేశారు. ఇందుకోసం ఎకరాకు రూ.30,000 పెట్టుబడి పెట్టారు. పంటను మార్కెట్ కు తీసుకురాగా, బాక్సును కేవలం రూ.40కే కొంటామని అక్కడి వ్యాపారులు స్పష్టం చేశారు. దీంతో మనస్తాపానికి లోనైన ఆదిపుల్లయ్య తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. ఒక్కో బాక్సును మార్కెట్ కు తీసుకురావడానికే రూ.20 ఖర్చువుతుందనీ, ఇంత తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే తామెలా బతకాలని ఆదిపుల్లయ్య ప్రశ్నించారు.