devegowda: మోదీకి పూర్తి మద్దతు ఇస్తాం.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: దేవెగౌడ
- పుల్వామా ఉగ్రదాడిని జీర్ణించుకోలేకపోతున్నా
- మోదీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తాం
- ఉగ్రవాదులను ఎక్కడికక్కడ అణచివేయాల్సిందే
పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ ప్రధాని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి తనను మోదీ ఆహ్వానించారని... ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తాము స్వాగతిస్తామని చెప్పారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముష్కరుల నుంచి ముప్పుపొంచి ఉంటుందని, వారిని ఎక్కడికక్కడ అణచివేయాల్సిందేనని చెప్పారు. మండ్య జిల్లాకు చెందిన ఓ జవాను ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారని, ఆయన పార్థివదేహం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుమారస్వామి వెళ్లి, ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు.