Andhra Pradesh: చిత్తూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. వేధింపులను అడ్డుకున్నందుకు యువతి కుటుంబ సభ్యులపై దాడి!

  • జిల్లాలోని మార్జేపల్లిలో ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • పరారీలో నిందితుడు చరణ్ రాజ్

తనను ప్రేమించాలని ఓ ప్రేమోన్మాది యువతి వెంటపడ్డాడు. కాలేజీకి వెళుతుండగా బస్టాపుల్లో వెంటపడి వేధించాడు. ఇదేంటని ప్రశ్నించిన అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులపై దాడికి దిగాడు. అయినా నిందితుడిని పోలీసులు ఇంతవరకూ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గంగవరం మండలం మార్జేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇదే గ్రామంలో జులాయిగా తిరుగుతున్న చరణ్ రాజ్(25) గత ఏడాది కాలంగా తనను ప్రేమించాలని యువతి వెంటపడి వేధిస్తున్నాడు. అతని వేధింపులు హద్దు దాటడంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సత్వరం స్పందించకపోవడంతో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న చరణ్ రాజ్ వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు.

దీంతో బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో యువతిని బస్టాప్ లో దించేందుకు ఆమె సోదరుడు చంద్రశేఖర్ వచ్చాడు. ఇది చూసిన నిందితుడు..‘నిన్ను చూసి భయపడతానని అనుకున్నావా?’ అంటూ గొడవకు దిగాడు. దీంతో యువతి తల్లిదండ్రులు, మామయ్య ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే చరణ్ రాజ్ తన అనుచరులకు ఫోన్ చేసి అక్కడకు రప్పించాడు.

అనంతరం వారితో కలిసి బాధిత కుటుంబంపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడటంతో యువతి తల్లిదండ్రులు, అన్న, మామయ్యను  చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సెక్షన్‌ 354, సెక్షన్‌ 324 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

Andhra Pradesh
Chittoor District
harrasment
Police
attack
  • Loading...

More Telugu News