Telangana: చిగురుపాటి జయరాం హత్య కేసు.. నేడు నిందితులను కోర్టు ముందు హాజరుపర్చనున్న పోలీసులు!
- నిన్నటితో ముగిసిన పోలీస్ కస్టడీ
- మరో ఏడు రోజులు పొడిగించాలని కోరనున్న అధికారులు
- రాకేశ్ కారు, బ్యాంకు అకౌంట్ వివరాలు స్వాధీనం
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ ల కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఈరోజు పోలీసులు వీరిద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో రాకేశ్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. నిందితులిద్దరిని విచారించేందుకు మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. నందిగామలో కారుతోపాటు జయరాంను వదిలిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు కోర్టు ఇచ్చిన 3 రోజుల గడువు సరిపోలేదని తెలిపారు. నిందితులను మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈరోజు కోర్టును కోరతామన్నారు. రాకేశ్ రెడ్డి కారుతో పాటు అతని బ్యాంకు ఖాతా వివరాలు, కొన్ని కీలక పత్రాలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందనీ, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు చెబుతామన్నారు.