Narendra Modi: తన చిన్ననాటి పేదరికం, టీ స్టాల్... ఊహకందని ఈ స్థాయి.. గురించి నరేంద్ర మోదీ చెప్పిన ఆసక్తికర విశేషాలు!
- చిన్న ఇంట్లో ఎనిమిది మందిమి ఉండేవాళ్లం
- పొద్దున్నే టీ స్టాల్ కు వెళ్లి శుభ్రం చేసేవాడిని
- ముంబైకి వెళ్లాలని కలలుకన్నాను
- 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కు తెలిపిన మోదీ
తన చిన్నతనంలో అనుభవించిన పేదరికం, తండ్రి నడిపిన టీ స్టాల్ లో తాను పడ్డ కష్టం, ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితం కావడం... తదితర విషయాలపై 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు, ప్రజాదరణ పొందిన ఫేస్ బుక్ బ్లాగింగ్ పేజ్ కి ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికర విశేషాలను చెప్పారు.
మోదీ మాటల్లోనే...
"నా కుటుంబంలో ఎనిమిది మంది 40/12 అడుగుల ఇంట్లో నివసించేవాళ్లం. అది చాలా చిన్నదే అయినా మాకు సరిపోయేది. మా అందరి జీవితాలూ ఉదయం 5 గంటలకు ప్రారంభం అయ్యేవి. మా అమ్మ పసిపాపలు, చిన్న పిల్లలకు సంప్రదాయక ఆహారాన్ని అందించేది. నేను, నా సోదరుడు కలిసి ఆమె కోసం 'చూలా' తయారుచేసేవాళ్లం. మా అమ్మ చదువుకోలేదు. అయితే, దేవుడి దయతో రోగాలను గుణపరిచే ప్రత్యేక విధానం ఆమెకు తెలుసు. నిత్యమూ చుట్టుపక్కల ఇళ్లలోని తల్లులు మా ఇంటి ముందు వరుసగా నిలబడి, ఆమె చికిత్స కోసం వచ్చేవారు"
"ఆ తరువాత నేను రైల్వే స్టేషన్ లో ఉండే నా తండ్రి టీ స్టాల్ ను తెరిచి శుభ్రం చేసి, బడికి వెళ్లేవాడిని. బడి అయిపోయిన తరువాత నా తండ్రికి సాయం చేసేవాడిని. స్టేషన్ కు వచ్చిన వారికి టీ అమ్ముతూ, వారి మాటలు వింటూ హిందీ నేర్చుకున్నాను. కొందరు వ్యాపారుల నోట బాంబే అనే పదం వింటూ, ఎప్పటికైనా ఆ కలల నగరాన్ని చూస్తానా? అనుకునేవాడిని. లైబ్రరీకి వెళ్లి దొరికిన పుస్తకాన్ని తీసుకుని చదివేసేవాడిని. నేను తొలిసారిగా ఆర్ఎస్ఎస్ సభలో పాల్గొన్న వేళ నా వయసు 8 సంవత్సరాలు. 9 ఏళ్ల వయసులో ఉండగా, గుజరాత్ లో వరదలు వస్తే, బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆహార కేంద్రంలో పనిచేశాను. నాకు ఎంత పని చేస్తే అంత తృప్తి కలిగేది"
"దారి ఎంత కఠినమైనా, నేను ఎంచుకున్న దారిలోనే వెళ్లేవాడిని. దుస్తుల ఇస్త్రీ కష్టమే అయినా, గ్లాసులో నిప్పులు వేసి, దాని చుట్టూ బట్టను చుట్టి, నా వస్త్రాలపై ఒత్తి పట్టుకునేవాడిని. చక్కని ఫలితమే లభించేది. అసలు నన్నెవరైనా భారతదేశపు ప్రధానమంత్రి అవుతారా? అని అడిగివుంటే... ఎప్పటికీ లేదు అనే సమాధానాన్నే చెప్పుండేవాడిని. నేను అలా ఆలోచించడం అనేది కూడా ఊహకు అందని విషయం" అంటూ మోదీ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ చెప్పిన విశేషాలను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'... 'ది మోదీ స్టోరీ' పేరిట అందుబాటులో ఉంచింది.