Andhra Pradesh: ఏపీ స్పీకర్ కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో అఖిలపక్షం ధర్నా!
- ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
- ధర్నాకు అనుమతి లేదని స్పష్టీకరణ
- కోడెల ఫ్యామిలీ అవినీతిపై విచారణకు నేతల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అఖిలపక్షం నేతలు అనుమతి తీసుకోకుండా ధర్నా చేస్తున్నారని స్పష్టం చేసిన పోలీసులు, వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని తేల్చిచెప్పారు.
మరోవైపు అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ.. ధర్నా అనుమతి కోసం మూడ్రోజుల క్రితమే పోలీసులకు దరఖాస్తు చేశామని తెలిపారు. కోడెల కుటుంబం సత్తెనపల్లిలో అవినీతికి పాల్పడిందనీ, దీనివల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆరోపించారు. కోడెల శివప్రసాద్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.