Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటాం.. వేరే చర్చ అనవసరం: రాహుల్ గాంధీ
- జవాన్లపై జరిగిన దాడి చాలా ఘోరమైనది
- రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు
- భారత్ ను ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం, భద్రతాదళాల వెంట విపక్షాలు మొత్తం ఉంటాయని ఆయన తెలిపారు. 'నా వరకైతే... దీనిపై ఇతర చర్చ అనవసరం. రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు' అని అన్నారు.
జవాన్లపై జరిగిన దాడి చాలా ఘోరమైనదని చెప్పారు. భద్రతాదళాలపై జరిగిన దారుణమైన హింస మనసును కలచివేస్తోందని అన్నారు. భారత్ ను ఏ శక్తి కూడా విచ్ఛిన్నం చేయలేదని చెప్పారు. మనం ఎంతో ప్రేమించే వ్యక్తుల మరణం గురించి తప్ప ఇతర విషయాల గురించి తాను మాట్లాడనని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో రానున్న కొన్ని రోజుల వరకు తాము ప్రభుత్వం వెంటే ఉంటామని చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, టెర్రరిజంను అందరం కలసి ఒక దేశంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.