India: ఆర్థిక సంక్షోభంలో ఐఎల్అండ్ ఎఫ్ఎస్.. 14 లక్షల మంది ఉద్యోగుల పీఎఫ్ నిధులకు ఎసరు!
- ఐఎల్అండ్ ఎఫ్ఎస్ లో పీఎఫ్ ట్రస్టుల పెట్టుబడులు
- బాండ్లు కొనుగోలు చేసిన 50కిపైగా ట్రస్టులు
- అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన వైనం
దాదాపు 14 లక్షల మంది ఉద్యోగుల ‘భవిష్య నిధి’ ప్రశార్థకంగా మారింది! ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూపులో 50కి పైగా భవిష్యనిధి (పీఎఫ్), పింఛన్ నిధి ట్రస్టులు రూ.వేల కోట్లలో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ గ్రూపునకు చెందిన చాలా కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించని స్థితిలో ఉన్నాయి. దీంతో ఈ గ్రూపులో బాండ్ల రూపేణా పెట్టిన ‘రూ. వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన పీఎఫ్ ట్రస్టులు ఆందోళన చెందుతున్నాయి. ఈ బాండ్లలో చాలా వరకు అన్‌సెక్యూర్డ్ కావడం ఇందుకు మరో కారణం. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌ఏటీ) పీఎఫ్ ట్రస్ట్స్ ఆశ్రయించాయి.
ఎంఎంటీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హడ్కో, సిడ్కో, ఐడీబీఐ, ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల భవిష్యనిధిని నిర్వహించే ఫండ్‌లు ఇప్పటికే పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో విద్యుత్ బోర్డుల ఉద్యోగుల పీఎఫ్ ట్రస్టులు కూడా పిటిషన్ దాఖలు చేసిన వాటిలో ఉన్నాయని తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లకు ‘ఏఏఏ’ రేటింగ్ ఉండేది. దీంతో వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుందనే నమ్మకంతో వీటికి పీఎఫ్ ట్రస్టులు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ గ్రూపు వెనక ప్రభుత్వ అండ ఉండటం పీఎఫ్ సంస్థలు మొగ్గు చూపడానికి మరో కారణం. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ లాంటి దిగ్గజాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ప్రమోటర్లుగా ఉన్నాయి.
ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపులో 302 సంస్థలు ఉండగా.. ఇందులో 169 భారతీయ కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో 22 మాత్రం అన్ని రకాల రుణాలను తిరిగి చెల్లించే స్థాయిలో ఉన్నాయి. 10 సంస్థలకు సెక్యూర్డ్ రుణాలను చెల్లించే స్థోమత ఉంది. 38 కంపెనీలు మాత్రం రుణాలు తీర్చలేని స్థితిలో ఉన్నాయి.