Telugudesam: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి విజయవాడకు చెందిన టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్?
- ఈ రోజు సాయంత్రం జగన్‌ని కలిసే అవకాశం
- కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న రమేష్
- టీడీపీ స్థాపించినప్పటి నుంచి కీలక సభ్యుడు
అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. విజయవాడకు చెందిన పార్టీ కీలక నాయకుడు, టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాసరి జైరమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖరారైందని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని నివాసంలో రమేష్ కలవనున్నారని సమాచారం. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన రమేష్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు పార్టీ కీలక వ్యవహారాలు చూసేవారు.
అయితే ఇటీవల కొంతకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను కూడా వైసీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు రోజుల వ్యవధిలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా రమేష్ కూడా అదేబాట పట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.