Karnataka: పేకాట వ్యసనంతో దొంగగా మారిన రైతు నాయకుడు!

  • డబ్బు కోసం చోరీలకు తెగబడిన వైనం
  • పోలీసులకు చిక్కడంతో ఆశ్చర్యకరమైన నిజాలు
  • నిందితుడు కర్ణాటకలో అధికార పార్టీ కార్యకర్త

వ్యసనం, ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంతటి పతనావస్థకు చేరుస్తాయనేందుకు అతనో ఉదాహరణ. సొంత రాష్ట్రంలో గౌరవప్రదంగా జీవించే అతను డబ్బు కోసం పక్క రాష్ట్రంలో దొంగ అవతారం ఎత్తాడు. పేకాట వ్యసనంతో ఆర్థిక కష్టాల్లో పడిన అతను డబ్బు సంపాదనకు చోరీ మార్గాన్ని అనుసరించాడు. పోలీసులకు చిక్కడంతో జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

పోలీసుల కథనం మేరకు ఆ వివరాలు ఇలా వున్నాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా ఆప్జల్‌పూర్‌ తాలూకా బొర్గికి చెందిన కాశీనాథ్‌ గైక్వాడ్‌ అలియాస్‌ కాశప్ప అక్కడి అధికార పార్టీ క్రియాశీలక కార్యకర్త. స్థానిక రైతు సంఘానికి అధ్యక్షుడు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. తన బంధువుతో కలిసి స్థానికంగా లేడీస్‌ ఎంపోరియం కూడా నడుపుతున్నాడు. దీనివల్ల గాజులు, అంకరణ సామగ్రి కొనుగోలుకు తరచూ హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌ ప్రాంతానికి వచ్చేవాడు. దీంతో నగరంపై అతనికి పూర్తి అవగాహన ఉంది. పేకాటకు బానిసైన కాశీనాథ్‌ ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు.డబ్బు సంపాదనకు కొత్త తరహాలో చోరీలకు యత్నించాడు. సొంత ప్రాంతంలో అయితే అంతా గుర్తిస్తారని  హైదరాబాద్‌ను ఎంచుకున్నాడు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చోరీ చేయాలనుకునే రోజు షాపు కట్టేశాక తన సెల్‌ఫోన్‌ ఇంట్లోనే ఉంచేసి బస్సెక్కేవాడు. తెల్లవారు జామున హైదరాబాద్‌లో దిగేవాడు. పగలు ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అవకాశం చిక్కగానే ఆ ఇళ్లలో చోరీకి పాల్పడి ఏమీ తెలియనట్టు బస్సెక్కి తిరిగి అప్జల్‌ పూర్‌ వెళ్లిపోయేవాడు. ఈ విధంగా గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ అయిదు నెలల్లో మియాపూర్‌ పరిధిలో 6, రాజేంద్రనగర్‌లో 5, నార్సింగ్‌, ఉప్పల్‌లో 2, బాచుపల్లిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

దొంగిలించిన నగలను ఆప్జల్‌పూర్‌లోని నగల వ్యాపారి కాలాసింగ్‌కు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. నగరంలోని పలుచోట్ల వరుస దొంగనాలు జరుగుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. అనుమానితుడి చిత్రాలు సేకరించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కాశీనాథ్‌ 16 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. కానీ గైక్వాడ్‌పై గతంలో ఎటువంటి కేసుల్లేకపోవడంతో దర్యాప్తుకు కొంత ఇబ్బంది ఎదురైంది.

సీసీ పుటేజీ పరిశీలించిన ఓ పోలీసు ఇన్‌ఫార్మర్‌ కీలక సమాచారం అందించడంతో సీసీఎస్‌ బృందాలు అప్జల్‌పూర్‌ వెళ్లి విచారించాయి. గైక్వాడ్‌ తొలుత బుకాయించినా సాక్ష్యాలన్నీ అతని ముందుంచడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టుచేసి 540 గ్రాముల బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇతని వద్ద బంగారం కొనుగోలు చేసిన కాలాసింగ్‌ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News