Srinagar: మాటలు రావడం లేదు: పుల్వామా ఘటనపై సెహ్వాగ్
- సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
- అమరులైన 42 మంది సైనికులు
- ఇకనైనా మారాలని ఉగ్రవాదులకు సెహ్వాగ్ హెచ్చరిక
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన ఆత్మాహుతి దాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఉగ్రవాదులది పిరికిపింద చర్యగా పేర్కొన్న సెహ్వాగ్.. దాడి విషయం తెలిసి చాలా బాధపడినట్టు పేర్కొన్నాడు. బాధను వర్ణించేందుకు తన వద్ద మాటలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సెహ్వాగ్.. ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇకనైనా మారాలని, లేకుంటే మార్చాల్సి వస్తుందని హెచ్చరించాడు.
సీఆర్‌పీఎఫ్ 54వ బెటాలియన్‌కు చెందిన జవాన్ల కాన్వాయ్ జమ్ము-శ్రీనగర్ హైవేపైనుంచి వెళ్తుండగా పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి తెగబడింది. దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలు నింపిన ఎస్‌యూవీ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చి వేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 42 మంది సైనికులు అమరులయ్యారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు.