Jayaram: జయరాం హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారం?
- 11 మంది అధికారుల పాత్రపై విచారణ
- నోటీసుల జారీకి రంగం సిద్ధం
- అంజిరెడ్డి, శ్రీను, చొక్కారామ్‌ల అరెస్ట్
- కేసులో రౌడీ షీడర్ నగేష్ ప్రమేయం
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులకు మరికొన్ని కీలక విషయాలు తెలిశాయి. కోటీశ్వరుడైన జయరాం నుంచి డబ్బు రాబట్టేందుకు రాకేష్ నకిలీ పత్రాలు సృష్టించినట్టు వెల్లడైంది. ఈ హత్య కేసులో కొందరు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే తెలిసింది. మొత్తం 11 మంది అధికారుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాకేష్‌తో సంబంధమున్న పోలీసు అధికారులకు నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. అలాగే ఈ కేసులో రౌడీ షీటర్ నగేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. నగేష్ సాయంతో జయరాం నుంచి రాకేష్ డబ్బులు రాబట్టేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే జయరాం హత్యకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, గడ్డం శ్రీను, చొక్కారామ్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జయరాంతో రాకేష్ సుమారు 10 ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.