chirala: చీరాలలో అభివృద్ధిని ఆమంచి ప్రస్తావించకపోవడం దారుణం: టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ
- పార్టీ మారిన ఆమంచి జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు
- సీఎం సహాయనిధి నుంచి వెయ్యి మందికి సాయం చేశాం
- రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు
ఇటీవలే టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీకి దగ్గరైన ఆమంచి కృష్ణమోహన్ పై తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారిన ఆమంచి, వాస్తవాలు మాట్లాడకుండా, వైసీపీ అధినేత జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని విమర్శించారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆమంచి ప్రస్తావించక పోవడం దారుణమని, సీఎం సహాయనిధి నుంచి చీరాలలో వెయ్యి మందికి రూ.6.11 కోట్లు ఇచ్చారని, వారందరిదీ ఏ కులం? అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ పైనా ఆమె విరుచుకుపడ్డారు. గుంటూరు పర్యటనకు మోదీ వచ్చిన సందర్భంలో నిరసన తెలపాల్సిన జగన్, స్వాగత బ్యానర్లు కట్టారని ఆరోపించారు. జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అనూరాధ విమర్శించారు.