Telangana: ‘ఖమ్మం’ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా!: రేణుకా చౌదరి సంచలన ప్రకటన
- ఖమ్మంపై చాలామంది సీనియర్ల చూపు
- ఈరోజు తన మద్దతుదారులతో రేణుక భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. పలువురు సీనియర్ నేతలు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఈరోజు సంచలన ప్రకటన చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని రేణుకా చౌదరి హెచ్చరించారు.
ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో రేణుకాచౌదరి తన నివాసంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకవేళ హైకమాండ్ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్ సభ విషయంలో కూడా హైకమాండ్ చివరివరకూ నాన్చుడు ధోరణిని పాటించవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, రేణుకా చౌదరి ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.