vijay mallya: నా డబ్బు తీసుకోమని బ్యాంకులకు మోదీ ఎందుకు చెప్పడం లేదు?: విజయ్ మాల్యా
- కర్ణాటక హైకోర్టు ముందు సమస్యను పరిష్కరించుకుందామని చెప్పారు
- డబ్బును రికవర్ చేసిన పూర్తి క్రెడిట్ మోదీ తీసుకోవచ్చు కదా?
- నా డబ్బును బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదు?
అందుబాటులో ఉన్న తన డబ్బును తీసుకోమని బ్యాంకులకు ప్రధాని మోదీ ఎందుకు సూచించడం లేదని లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా ప్రశ్నించారు. నిన్న లోక్ సభలో మోదీ మాట్లాడుతూ, విజయ్ మాల్యాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రూ. 9వేల కోట్లతో ఒక వ్యక్తి విదేశాలకు చెక్కేశారంటూ మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా మాల్యా స్పందించారు.
'పార్లమెంటులో ప్రధాని ప్రసంగం నా దృష్టికి వచ్చింది. ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. రూ. 9వేల కోట్లతో ఒక వ్యక్తి విదేశాలకు చెక్కేశారని మోదీ అన్నారు. అది నన్ను ఉద్దేశించి అన్నదనే విషయం నాకు తెలుసు. మోదీని ఎంతో గౌరవంతో ఒక విషయం అడుగుతున్నా. టేబుల్ పై నేను ఉంచిన డబ్బును తీసుకోవాలని బ్యాంకులకు మోదీ ఎందుకు సూచించడం లేదు? కింగ్ ఫిషర్ కు ఇచ్చిన అప్పులను రికవర్ చేసిన పూర్తి క్రెడిట్ ను మోదీ తీసుకోవచ్చుకదా. కర్ణాటక హైకోర్టు ఎదుట సమస్యను పరిష్కరించుకుందామని నేను చెప్పాను. నా ఆఫర్ ను పనికిమాలిన చర్యగా పక్కన పెట్టకూడదు. ఎంతో నిబద్ధతతో, నిజాయతీతో నేను ఈ ఆఫర్ ఇచ్చాను. నా డబ్బును బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదు?' అంటూ ట్విట్టర్ ద్వారా మాల్యా స్పందించారు.