narvey: అతని నిజాయతీకి బహుమతి రూ.28 వేలు... విదేశీయుడిని ఆకట్టుకున్న బార్బర్
- ఫుట్‌పాత్‌పై ఉన్న సెలూన్‌లో హెయిర్ కట్ చేయించుకున్న నార్వే దేశస్థుడు
- ఈ సందర్భంగా తన యూట్యూబ్ కోసం పలు వివరాలు సేకరణ
- పనిపూర్తయ్యాక ఫీజు ఎంతంటే రూ.20 అడిగిన బార్బర్
తన సెలూన్‌కు వచ్చిన ఓ విదేశీయుడు హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆ సందర్భంగా అతను ఎన్నో ప్రశ్నలు వేశాడు. వివరాలు రాబట్టాడు. ఆ బార్బర్ తన పని తాను చేసుకుంటూనే వివరాలన్నీ తెలిపాడు. అందుకే పనిపూర్తయ్యాక ‘చార్జి’ ఎంత అంటే నిజాయతీగా తాను సాధారణంగా అందరి వద్దా వసూలు చేసే రూ.20లు తీసుకున్నాడు. ఈ నిజాయతీ నార్వేనియన్‌ని కట్టిపడేసింది. ఆనందంతో అతని చేతిలో 400 వందల డాలర్లు (దాదాపు 28 వేల రూపాయలు) పెట్టి అభినందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే... యూట్యూబర్‌గా సుపరిచితుడైన నార్వే దేశానికి చెందిన హెరాల్డ్ బార్డ్ ర్ దేశవిదేశాల్లో తిరుగుతూ చిన్నచిన్న ట్రావెల్ వీడియోలు తీసి పోస్టు చేస్తుంటాడు. ఈసారి భారత్‌కు వచ్చిన అతను అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. తొందరగా ట్రిమ్ చేయమని చెప్పి దాన్ని తాను చిత్రీకరించుకుంటానని ఆ బార్బర్ నుంచి అనుమతి తీసుకున్నాడు. బార్బర్ తనకు ట్రిమ్ చేస్తున్న సమయంలోనే రోజుకి ఎంత మంది కస్టమర్లు వస్తారు, ఎలా వ్యాపారం జరుగుతుంది, పేవ్‌మెంట్‌పై షాపు నిర్వహిస్తున్నందుకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా? వంటి వివరాలు తెలుసుకున్నాడు.
కటింగ్ పూర్తయ్యాక బార్బర్‌తో సెల్ఫీలు దిగాడు. అనంతరం కటింగ్ చార్జి ఎంతని అడగగా అతను 20 రూపాయలని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం హెరాల్డ్ వంతయింది. ‘అంతసేపు పని చేయించుకున్నందుకు, పలు వివరాలు రాబట్టినందుకు నానుంచి అతను ఎక్కువ మొత్తం ఆశిస్తాడని అనుకున్నా. కానీ అతను నిజాయతీగా తన శ్రమకు తగ్గ చార్జి మాత్రమే అడిగాడు. ఆతని ఆనెస్టీ నన్ను ఆకట్టుకుంది’ అంటూ హెరాల్డ్ అతని చేతిలో 400 డాలర్లు (రూ.28 వేలు) పెట్టాడు.
నా ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తికి అదనంగా బహుమానం ఇచ్చానన్న ఉద్దేశంతోనే ఈ మొత్తం ఇచ్చానని హెరాల్డ్ తెలిపాడు. డబ్బు ఇచ్చిన సమయంలో ఆ మొత్తంతో ఇంటికి ఉపయోగపడే ఏదైనా వస్తువు కొనుక్కోవాలని, జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని హెరాల్డ్ సూచించాడు. హెరాల్డ్ అభిమానానికి ముగ్ధుడైన బార్బర్ అతనికి ఓ కప్పు కాఫీ తెచ్చి ఇచ్చి తన ఆప్యాయతనూ చాటుకున్నాడు.