Statue of unity: పటేల్ విగ్రహానికి సందర్శకుల తాకిడి.. భారీ ఆదాయం!
- నర్మద నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు
- మూడు నెలల్లో రూ.19 కోట్ల ఆదాయం
- పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
గతేడాది అక్టోబరు 31న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కాసుల వర్షం కురిపిస్తోంది. 33 నెలల్లో రూ.2,989 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహాన్ని తీవ్ర భూకంపాలు వచ్చినా తట్టుకునేలా తీర్చిదిద్దారు. గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేయగా ఇప్పుడీ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది. వందలాదిమంది ఈ విగ్రహం చూసేందుకు తరలివస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది.
గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య విగ్రహాన్ని ఏకంగా 7,81,349 మంది సందర్శించారు. వీరి నుంచి ఏకంగా 19.47 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. విగ్రహంతోపాటు పక్కనే ఉన్న సర్దార్ సరోవర్ డ్యాంను సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగిందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కేజే ఆల్పాన్స్ తెలిపారు. మూడు నెలల్లో 8,22,009 మంది డ్యాంను సందర్శించినట్టు వివరించారు.