Uttar Pradesh: అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకున్న యోగి ప్రభుత్వం... దద్దరిల్లిన యూపీ
- లక్నో విమానాశ్రయంలో అఖిలేశ్ అడ్డగింత
- దద్దరిల్లిన ఉభయ సభలు
- రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన తెలిపిన ఎస్పీ కార్యకర్తలు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను యోగి సర్కారు అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎస్పీ కార్యకర్తల నిరసనలతో రాష్ట్రం దద్దరిల్లింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అఖిలేశ్ యాదవ్ అలహాబాద్ యూనివర్సిటీకి బయలుదేరారు.
అయితే, లక్నో విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తాను చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై అసెంబ్లీ, శాసన మండలి కూడా దద్దరిల్లాయి. ఎస్పీ సభ్యులు రాజ్‌భవన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు.
మరోవైపు యోగి ప్రభుత్వం తనను అడ్డుకోవడంపై అఖిలేశ్ స్పందించారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారం కూడా యోగి సర్కారుకు నిద్రలేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. విమానాశ్రయంలోనే తనను అడ్డుకున్నారంటే అందులో కేంద్రం పాత్ర కూడా ఉండే ఉంటుందని ఆరోపించారు.
అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన ఎస్పీ కార్యకర్తలపై లాఠీ విరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు లాఠీచార్జీకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గోరఖ్‌పూర్‌లో నిరసనకారులు వాహనాల అద్దాలను పగులగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది.