Stock Market: మన మార్కెట్లకు ఈ రోజూ నష్టాలే!
- పని చేయని సెంటిమెంట్
- 241 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 57 పాయింట్ల నష్టంలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లో ఈ రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఆసియా, యూరప్ సహా వివిధ దేశాల మార్కెట్లు లాభాలలో కొనసాగినప్పటికీ ఆ సెంటిమెంట్ మన మార్కెట్లపై కనిపించలేదు. జనవరి నెల ద్రవ్యోల్బణం డేటా విడుదల, ప్రముఖ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు దిగారు. దీంతో ఓపెనింగ్ బెల్ నుంచీ మార్కెట్లు నష్టాలతోనే కొనసాగి చివరికి నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి.
పర్యవసానంగా సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 36153 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 10831 వద్ద స్థిరపడ్డాయి. ఇక ఈ రోజు మన మార్కెట్లలో జీ ఎంటర్ టైన్మెంట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్ వంటి షేర్లు లాభాలు గడించగా; భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటాకార్ప్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.