bayyaram steelplant: బయ్యారం స్టీల్‌పై కాంగ్రెస్ ఉడుం పట్టు.. దీక్షకు సిద్ధమవుతున్న ఇల్లెందు ఎమ్మెల్యే
- రేపటి నుంచి 36 గంటల పాటు దీక్ష
- ప్రకటించిన శాసన సభ్యురాలు హరిప్రియ
- ఉత్తుత్తి సర్వేలు మాని కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ఉత్తుత్తి సర్వేలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికైనా స్వస్తిపలకాలని, చిత్తశుద్ధి ఉంటే తక్షణం కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తెలంగాణలోని కేసీఆర్, మోదీ సర్కార్‌లను డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు తక్షణ చర్యలు కోరుతూ బుధవారం నుంచి బయ్యారంలో 36 గంటల దీక్షకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం అంశాన్ని చేర్చి ఆరేళ్లు కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోకపోవడం దారుణమని అన్నారు. హరిప్రియ దీక్ష నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పట్టుదలను ప్రజలకు తెలియజేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
బుధవారం హరిప్రియ దీక్ష చేపట్టి గురువారం ముగించనున్నారు. అందువల్ల ఈ ముగింపు సభకు పార్టీ అతిరథులు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, సినీనటి విజయశాంతి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు రాష్ట్ర స్థాయి నాయకులు మరికొందరు హాజరు కానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.