Andhra Pradesh: 2011లో మీ గుజరాత్ దీక్షకు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టారు?: మోదీకి సీఎం చంద్రబాబు సూటిప్రశ్న

  • ఫొటో సెషన్ కోసం ఢిల్లీకి రాలేదు
  • మోదీ కంటే దేవెగౌడనే గొప్ప
  • ఏపీకి ఇంకా రూ.లక్ష కోట్లు రావాలి

టీడీపీ నేతలు ఫొటో సెషన్ కోసం ఢిల్లీకి వెళుతున్నారని ప్రధాని గుంటూరు సభలో చెప్పడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. తాము ఫొటో సెషన్ కోసం ఢిల్లీకి రాలేదనీ, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి, దేశ ప్రజలకు తెలియజేయడానికే వచ్చామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి మెజారిటీ అప్పగించినప్పటికీ ప్రధాని మోదీ ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. ఢిల్లీలోని  ఏపీభవన్ లో ధర్మపోరాట దీక్ష ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడారు.

జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారనీ, అధికారంలో ఉన్నది తక్కువ కాలమే అయినా అద్భుతమైన పాలసీలు తీసుకొచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. దేశ ప్రజలను విభజించి, విద్వేషాలను మోదీ పెంచారని దుయ్యబట్టారు. దేవెగౌడ ఈశాన్య భారతంలోని ప్రజల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారనీ, ఇప్పుడు మోదీ అక్కడకు వెళితే నల్లజెండాలు చూపుతున్నారని విమర్శించారు. దేవెగౌడకు, మోదీకి ఉన్న తేడా అదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ‘గుజరాత్ లో 2011, సెప్టెంబర్ లో శాంతి- సామరస్యం- ఐకమత్యం కోసం చేసిన ప్రభుత్వ ప్రయోజిత 3 రోజుల దీక్షకు ఎంత ఖర్చు పెట్టారని నేను ప్రశ్నిస్తున్నా. రూ.1.67 కోట్లు ఖర్చు పెట్టారు. గుజరాత్ లో మతవిద్వేషాలు సృష్టించింది మీరే. మళ్లీ దీక్షలు చేస్తున్నది కూడా మీరే.

ముఖ్యమంత్రిగా మోదీకి అర్హత లేదు.. వెంటనే రాజీనామా చేయాలని అప్పట్లోనే మేం డిమాండ్ చేశాం. ఇప్పుడు ఏపీ విషయంలో ప్రధానిగా కొనసాగే అర్హత ఆయనకు లేదని దీక్ష చేస్తున్నాం. ఏ రికార్డులు చూసినా ఏపీకి ఇంకా రూ.లక్ష కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి. వీటిని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు’ అని విమర్శల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News