Rahul Gandhi: ఎలాంటి ప్రధానమంత్రి మనకు దొరికాడు?... దురదృష్టం!: రాహుల్ గాంధీ
- ధర్మపోరాట దీక్షా స్థలికి వచ్చిన రాహుల్ గాంధీ
- చంద్రబాబునాయుడికి సంఘీభావం
- కాంగ్రెస్ వచ్చి అన్ని హామీలూ నెరవేరుస్తుందని హామీ
ఓ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రధానమంత్రి పాలనలో దేశం ఉండటం అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ధర్మపోరాట దీక్షా సభకు వచ్చిన ఆయన, చంద్రబాబునాయుడికి సంఘీభావం తెలిపారు. ఆపై మాట్లాడుతూ, మాట ఇచ్చి నిలుపుకోలేని ఘనత వహించిన ప్రధాని దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ప్రధాని ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం నిమిషాల్లో జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఏ ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతంలో ఓ అబద్ధం చెప్పి వచ్చే నరేంద్ర మోదీ, మరో ఒకటి, రెండు నెలల్లోనే ప్రజల్లోని ఆగ్రహాన్ని చవిచూడబోతున్నారని, విపక్ష పార్టీలన్నీ కలిసి ఆయనకు బుద్ధి చెబుతాయని అన్నారు. కాపలాదారుగా ఉండాల్సిన వ్యక్తి దొంగగా మారాడని, ఏపీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బును అనిల్ అంబానీ ఖాతాలోకి మళ్లించారని ఆరోపించారు. మోదీకి మరోసారి ప్రధాని అయ్యే అర్హతలేదని అన్నారు.