Chandrababu: ప్రధానికి ఐదు పేజీల లేఖ రాసిన చంద్రబాబు.. మోదీని తూర్పారబట్టిన సీఎం

  • మోదీ విమర్శలకు సూటిగా స్పందించిన చంద్రబాబు
  • మోదీ కుళ్లుకునేలా అమరావతిని నిర్మిస్తానన్న సీఎం
  • మోదీ వెన్నుపోటును అద్వానీ కన్నీళ్లే చెబుతున్నాయన్న బాబు

గుంటూరు పర్యటనలో తనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఘాటు లేఖ రాశారు. విభజన హామీలను నెరవేర్చని ప్రధాని ప్రజల దృష్టి మరల్చేందుకు తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. తనపై చేసిన విమర్శలకు ప్రతిగా ఐదు పేజీల లేఖ రాశారు.

లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం...  ప్రధాని దుష్టసంస్కృతి ఆయన మాటల్లోనే బయటపడిందని చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ చెప్పినా, చెప్పకపోయినా తానే సీనియర్‌నని పేర్కొన్నారు. ఆయన ఎగతాళి వ్యాఖ్యలే బీజేపీ పతనానికి బీజం వేస్తాయన్నారు. ప్రధాని మాటల్లో తనపై అణువణువునా పెంచుకున్న కక్ష బయటపడిందన్నారు. అమరావతికి ఎవరెంత చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు.

అమరావతి కోసం రైతులు రూ.50 వేల కోట్ల విలువైన భూములను ఇవ్వడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 1500 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా సరిపోవని తూర్పారబట్టారు. ఆయన కళ్లముందే వచ్చే ఐదేళ్లలో ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని సవాలు విసిరారు. ప్రధాని అసూయతో మరింత రగిలిపోయేలా చేస్తానని పేర్కొన్నారు.

లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన జగన్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని వెన్నుపోటు, ఫిరాయింపుల గురించి మోదీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని లేఖలో ధ్వజమెత్తారు. అద్వానీకి మీరు పొడిచిన పోటు గురించి ఆయన కన్నీళ్లే చెబుతున్నాయని అన్నారు. గతంలో మీరు నిందించిన కేసీఆరే మీకిప్పుడు పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తన కుమారుడు లోకేశ్ గురించి మోదీ సర్టిఫికెట్ అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ స్క్రిప్ట్‌ను మోదీ చదివినట్టు అందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిన ప్రధానిని భరించాల్సి వస్తోందనేదే తమ బాధని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News