modi: మెజార్టీ తగ్గే పరిస్థితులు ఉన్నా మోదీనే మా ప్రధాని అభ్యర్థి: కేశవ్ ప్రసాద్ మౌర్య
- మోదీకి సాటి రాగల నాయకులు లేరు
- 300 స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుంది
- భారీ మెజార్టీతో మోదీ మరోసారి ప్రధాని అవుతారు
ప్రధాని మోదీ నాయకత్వానికి మరెవరూ సాటిరారని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకు మెజార్టీ తగ్గే పరిస్థితి తలెత్తినా ఆయనే తమ ప్రధాని అభ్యర్థి అని... ఆయనను మించిన నాయకుడు మరెవరూ లేరని చెప్పారు. బీజేపీకి సరిపడా మెజార్టీ సీట్లు రావనేది కేవలం ఊహగానాలు మాత్రమేనని అన్నారు. భారీ మెజార్టీతో మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కంటే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న నితిన్ గడ్కరీ ప్రధాని అభ్యర్థి అవుతారంటూ వార్తలు వస్తున్న తరుణంలో కేశవ్ ప్రసాద్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని, అందులో 300 స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
బీజేపీకి మెజార్టీ రాదని కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని కేశవ్ ప్రసాద్ అన్నారు. మమతా బెనర్జీ లాంటి కొందరు తమను తాము ప్రధాని అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వీరి కలలను మోదీ పటాపంచలు చేస్తూ, మరోసారి ప్రధాని అవుతారని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా కేంద్రం తొలగిస్తోందని తెలిపారు.