Andhra Pradesh: చంద్రబాబు ప్రజల సొమ్ముతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వస్తున్నారు.. ప్రజలు నిలదీయాలి!: ప్రధాని మోదీ
- కాంగ్రెస్ ను ఎన్టీఆర్ దుష్టులు అనేవారు
- నిజాలు చెప్పేందుకే ఏపీకి వచ్చాను
- గుంటూరు జిల్లా ప్రజా చైతన్య సభలో ప్రధాని
ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ఎన్టీఆర్ దుష్టులు అనేవారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అలాంటి పార్టీతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. ఈ పొత్తును చూసి ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని లోకేశ్ తండ్రి భావిస్తున్నారనీ, ఈ నిజాలను చెప్పడానికే తాను ఏపీకి వచ్చానని మోదీ అన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు జరిగిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడారు.
అధికారంలో ఉండి ఎన్నికలలో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదని మోదీ విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు. తన కుమారుడు లోకేశ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏపీ ప్రజలపై రుద్దాలని ఆయన చూస్తున్నారని మండిపడ్డారు. తాను ధనికుడిని ఎలా అయ్యానో ప్రజలకు తెలుస్తుందన్న భయంతో బాబుకు నిద్ర పట్టడం లేదనీ, వణుకుతున్నారని వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రజల సొమ్ముకు లెక్కలు అడగడంతో చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీలోని నేతలు ఎవరూ ఇలాంటి లెక్కలు అడగలేదన్నారు. ‘ఆంధ్రా ప్రజలారా.. మేల్కొనండి. రేపు చంద్రబాబు ఫొటోలు దిగడానికి ఢిల్లీకి వెళుతున్నారు. వెంట భారీ మందీమార్బలంతో ఢిల్లీకి వస్తున్నారు. బీజేపీ సొంత నిధులతో గుంటూరు సభ పెడితే, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు’ అని విమర్శించారు.
ఈ విషయమై ఏపీ ప్రజలు చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే ఢిల్లీకి రాకముందు, తనను తిట్టేముందు ఏపీ ప్రజలకు ఖర్చుపై లెక్కలు చెప్పి రావాలని చంద్రబాబుకు మోదీ సవాల్ విసిరారు.