Andhra Pradesh: అవును, చంద్రబాబు సీనియరే.. మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్!: ప్రధాని మోదీ సెటైర్లు

  • చంద్రబాబును ఏనాడూ అగౌరవపర్చలేదు
  • మామకు వెన్నుపోటు వేయడంలో ఆయనే సీనియర్
  • గుంటూరులో ప్రజా చైతన్య సభలో మోదీ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు ఏమయిందో అని తనకు ఆందోళనగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు మాటిమాటికీ ‘నేను మోదీ కంటే సీనియర్’ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన కంటే చంద్రబాబు సీనియర్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు జరిగిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడారు.

చంద్రబాబు సీనియర్ కాబట్టే ఆయన్ను ఎన్నడూ అగౌరవించలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయన్ను ప్రతీసారి గౌరవించామని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలను మార్చడంలో, పార్టీల ఫిరాయింపులు చేయడంలో, సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మాత్రమే చంద్రబాబు సీనియర్ అని ఎద్దేవా చేశారు. ఈరోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి, రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘ఎన్టీఆర్ కుర్చీని అందుకున్న వ్యక్తి(చంద్రబాబు) ఆయన కలలను నిజం చేస్తానని చెప్పాడా? లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా? లేదా? కానీ ఈరోజు ఎన్టీఆర్ మాటలకు గౌరవం ఇస్తున్నారా? ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లకు ఎందుకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పంచన వెళ్లి కూర్చోవాల్సినంత ఇబ్బంది చంద్రబాబుకు ఏమొచ్చింది?

పార్టీ సిద్ధాంతాలను వదిలేయాల్సినంత ఒత్తిడి ఏమి వచ్చింది? కాంగ్రెస్ అణచివేత, అహంకారం నచ్చకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి, కాంగ్రెస్ ముక్త ఏపీని చేయాలని నిర్ణయించుకున్నారు‘ అని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ కు అనుకూలంగా నడవాల్సిన టీడీపీ అధినేత ఇప్పుడు కాంగ్రెస్ తోనే కలిసి వెళుతున్నారని దుయ్యబట్టారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
ntr
Narendra Modi
BJP
iam the senior
  • Loading...

More Telugu News